మహాభారతంలో ఖిల పర్వం …. హరివంశ పర్వం

భారత ఇతిహాసాలలో ముఖ్యమైనది మహాభారతం గ్రంధం. ఇది దేవనాగరి భాషలో (సంస్కృతం) వ్రాయబడి ఉంది. దీనిని సాక్షాత్ విష్ణు స్వరూపమైన వేదవ్యాస భగవానులు చెప్పగా దానిని ‘గణపతి’ రచించాడని భారతీయులందరి (ముఖ్యంగా హిందువుల) ప్రగాడ విశ్వాసం. ఆర్య, ద్రావిడ, హిందూ సంస్కృతులకి వేదాలు నాలుగు ప్రామాణికాలు. ఐతే ఈ ‘మహాభారత కావ్యం పంచమవేదం గా ప్రసిద్దిగాంచింది.

మహా భారతం యొక్క అసలు పేరు “జయం” సంకలనం. అసంఖ్యాకమైన పాత్రలతో, సన్నివేశాలతో, ఏ పాత్రనూ, సన్నివేశాన్ని మినహాయించలేని విధముగా రూపొందించిన వేదవ్యాస భగవానుడు, ఈ బృహత్తర గ్రంధం లో కీలకమైన పాత్ర కూడా పోషిస్తారు.
మహా భారతము- “పర్వములు” అనగా చెరకు గడల కణుపులు” – అని అర్ధము.
ఇది 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములు లేక 18 లక్షల పదములు) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటై యున్నది.
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్” – “ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు” అని అర్ధం.
పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోనివే.

మహాభారతకథను అనేక లోకాల్లో వేరు వేరు వారిని వ్యాసభగవానుడు నియమించారు. స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ, గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు.

మహాభారత గ్రంధంలోని మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు.వ్యాసభగవానుని మహాభారతం 18 పర్వములు మాత్రమే, కానీ దీనికి అనుభందంగా ఒక పర్వం జోడించబడింది. అదే హరివంశ పర్వం.

వివరాల్లోకి వేలితే:
మహాభారత గాథను వ్యాసభగవానుడు మొదటగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటపుడు మహారాజు ఐన జనమేజయునికి చెప్పించగా, ఇదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.

భారతకధ విన్న జనమేజయునికి సంతృప్తి కలుగలేదు, తనకు కలిగిన అసంతృప్తిని దాచలేక వైశంపాయనుడితో ” మహాత్మా ! భారతమును పూర్తిగావిన్నా నామనస్సులో ఇంకా అసంతృప్తి ఉంది. దాని కారణమేమనగా మహానుభావుడైన శ్రీకృష్ణుని యదువంశ చరిత్ర గురించి భారతంలో అవసరమైనంత వరకే చెప్పబడినది. మీరు సర్వజ్ఞులు కనుక నాకు శ్రీకృష్ణుడు జన్మించిన వృష్టివంశ చరిత్ర వినిపించి నన్ను ధన్యుడిని చేయండి ” అని అడిగాడు. వైశంపాయనుడు అదివిని చిరునవ్వు నవ్వి. జనమేజయమహారాజా ! నీకు కలిగినట్లే వ్యాసుడికి కూడా ఇదే అసంతృప్తి కలిగింది. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతరమైన వ్యాసభగవానుడు భారతము వ్రాసిన పిదప ధర్మరక్షకుడైన శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన వృష్టివంశ చరిత్రను ఖిలపర్వము అనే పేరుతో రచించాడు. భారతం పద్దెనిమిది పర్వాలే. ఖిలపర్వము దానిలో ఒక భాగం అయింది. ఖిలపర్వము చేరితేనే అది మహాభారతం అయ్యింది.

—- సుభానంద ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here