మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ పయనమైన సిఎం కేసీఆర్ అండ్ ఫ్యామిలీ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. విజయవాడ దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని మొక్కుకున్న కెసిఆర్… తన మొక్కు తీర్చుకునేందుకు రెడి అయ్యారు. పలు దేవుళ్ళకు ఇప్పటికే తన మొక్కులను తీర్చుకోగా తాజాగా ఈ రోజు కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్లనున్నారు. అత్యంత ఆకర్షణీయంగా డిజైన్ చేసిన ముక్కుపుడకను దుర్గమ్మకు సమర్పించనున్నారు. అటు.. కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరోసారి ఏపీకి వెళ్తున్నారు. సీఎం హోదాలో ఇప్పటికే మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారాయన. గతంలో అమరావతి శంకుస్థాపనతో పాటు చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు విజయవాడ వెళ్లారు. తెలంగాణ మొక్కు తీర్చుకోవటానికి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మకు బంగారు ముక్కుపుడక మొక్కును చెల్లించడానికి వెళుతున్నారు కేసీఆర్‌. మధ్యాహ్నం 12 గంటల తరువాత కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని అమ్మవారికి బంగారు ముక్కుపుడక సమర్పిస్తారు. గురువారం ఉదయాన్నే గన్నవరం చేరుకుని.. రోడ్డు మార్గాన దుర్గగుడికి చేరుకుంటారు కేసీఆర్‌ . మరోవైపు సీఎం కేసీఆర్‌ వస్తున్నట్టు సమాచారం అందడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here