చేతి ఉంగరంతో సరికొత్త గిన్నిస్ రికార్డ్

భారత దేశ వజ్రాల రాజధాని గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఆభరణాల తయారీదారులు తమ కళాకృతి ప్రపంచ రికార్డ్ సాధించారు. 6,600 లకు పైగా వజ్రాలు పొదిగిన చేతి ఉంగరంతో సరికొత్త గిన్నిస్ రికార్డ్ సృష్టించారు.
సూరత్‌కు చెందిన విశాల్‌ అగర్వాల్‌, ఖుష్బూ అగర్వాల్‌ ఈ ఉంగరాన్ని రూపొందించారు. 18 క్యారెట్ల రోజ్‌ గోల్డ్‌తో తామరపువ్వు ఆకారంలో చేసిన ఈ ఉంగరం తయారీకి 6,690 వజ్రాలను వినియోగించారు. ఉంగరంపై ఉన్న 48 తామర రేకులను వజ్రాలతో చేశారు. గిన్నిస్‌ రికార్డు ప్రకారం.. దీని ధర దాదాపు రూ. 28కోట్లు ఉంటుందట.
58 గ్రాముల బరువున్న ఈ ఉంగరాన్ని తయారుచేసేందుకు ఆరు నెలలు పట్టిందట. ఈ సందర్భంగా ఉంగరం తయారీదారులు మాట్లాడుతూ.. నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకే ఇలా కమలం లాంటి ఆభరణాన్ని తయారుచేశామన్నారు. తామరపువ్వు మన జాతీయ పుష్పమే గాక.. నీటిలో పెరిగే అందమైన రూపమని, అందుకే దీన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.
ఈ ఉంగరానికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు తమ ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఇప్పటికే లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. చూడటమే కాదు.. ‘ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసిన వారు తమ చుట్టూ ఎప్పుడూ భద్రతాసిబ్బందిని పెట్టుకోవాలి’ అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here