చేతులెత్తేసిన వాట్సాప్

మెస్సేజ్ లను తొలుత ఎవరు పంపించిందీ తెలుసుకునే సాఫ్ట్ వేర్ ను తాము రూపొందించలేమని తేల్చి చెప్పింది. ఫేక్ న్యూస్ ను అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపధ్యంలో వాట్సాప్ ఈ ప్రకటన చేసింది. అటువంటి సాఫ్ట్ వేర్ ను కనుక అందుబాటులోకి తీసుకొస్తే ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ను విఘాతం కలిగినట్లు అవుతుందని, అది వాట్సాప్ స్వభావాన్ని పూర్తిగా దెబ్బ తీస్తుందని పేర్కొంది. వాట్సాప్ మిస్యూజ్ అవుతుందన్న కారణంతో నిబంధనలను సడలించలేమని, వాట్సాప్ ను బలహీన పర్చలేమని వాట్సాప్ అధికార ప్రతినిధి తేల్చి చెప్పారు. అత్యంత సున్నితమైన విషయాలను కూడా వాట్సాప్ పై నమ్మకంతో పంచుకుంటున్నారని, ఇప్పుడా నమ్మకాన్ని వమ్ము చేయలేమని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పింది. ముఖ్యంగా డాక్టర్లు, బ్యాంకులు, కుటుంబ సభ్యులు అత్యంత రహస్యమైన సంభాషణలకు కూడా వాట్సాప్ ను వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా వాట్సాప్ లో తప్పుడు సమాచారం అడ్డు అదుపు లేకుండా షేర్ అవుతుంది. ఇది మూక హత్యలకు దారితీస్తోంది. రెండ్రోజుల క్రితం వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్.., కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఫేక్ న్యూస్ కు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా తొలుత ఆ న్యూస్ ను ఎవరు షేర్ చేస్తున్నదీ గుర్తించేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేయాలని సూచించారు.అలాగే ఫిర్యాదుల స్వీకరణకు ఓ అధికారిని కూడా నియమించాలని వాట్సాప్ సీఈవో ను కోరారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపద్యంలో వాట్సాప్ మా వల్ల కాదని ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here