శ్రావణ లక్ష్మి శోభను సంతరించుకున్న ఆలయాలు

పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు కనుక ఈ నెలను శ్రావణ మాసం అంటారు. ఈ మాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీవ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను చేకురతాయి.

ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఎంతో నిష్టతో ఆచరిస్తారు. మహిళలు సంతానం అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని ఈవ్రతాన్ని చేస్తారు. కైలాసంలో శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతి దేవి వచ్చి శివుణ్ణి దేవా లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని అడిగినప్పుడు మహాశివుడు స్త్రీలకు సకల ఐశ్వర్యాలనూ పుత్రపౌత్రాదులనూ ఇచ్చే వ్రతంగా ‘వరలక్ష్మి’ వ్రతంను ఉపదేశించినట్లు ఉపనిషత్తులు చెపుతున్నాయి.

కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుంటే శ్రావణమాసంలో మంగళ, శుక్రవారాలు విశిష్టతను సంత రించుకున్నాయి. కార్తీకమాసం శివకేశవులకి ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీపార్వతులకు అంత ప్రీతి కరమైనది. ఈమాసంలో మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తుంటారు. మంగళగౌరి ఆరాధనలో భాగంగా నోములు, వ్రతాలు చేస్తుంటారు. సంతాన సౌభాగ్యాలను ఇచ్చి ఆతల్లి రక్షిస్తూ ఉంటుందని మహిళల విశ్వాసం. శ్రావణ మాసం అంటే శుభ మాసం శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈనెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈనెలలోనే జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలా అనేక పర్వ దినాలు వస్తాయి.

శ్రావణ మాసంను చంద్రుడి మాసం అని కూడా అంటారు. ఈమాసంలో నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర వేత్తల నమ్మకం. మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే అనారోగ్యముల నుండి తప్పించుకుని మంచి ఆరోగ్యం పొందడం కోసం ఈశ్రావణ మాస నియమాలు మన పెద్దలు ఏర్పాటు చేసారు అనే సిద్ధాంతం కూడ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మహిళా భక్తుల రద్దీతో నిండిపోయాయి. ప్రతి ఇల్లు శ్రావణ శుక్రవార శోభను సంతరించుకుంది. వరలక్ష్మి దేవికి స్వగతం పలుకుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here