నాలుగు రోజుల్లో ముందస్తుపై స్పష్టత ఇచ్చేస్తాం: మంత్రి కేటీఆర్

నాలుగు రోజుల్లో ముందస్తు ఎన్నికలపై స్పష్టత ఇచ్చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. తాము అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రతిపక్షాలు ఎందుకు బయపడుతున్నాయని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ వద్ద జరుగుతున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లు ఏం చేశామో చెప్పేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతల దగుల్బాజీ ప్రేలాపనలను అస్సలు పట్టించుకోమని, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, రేవంత్ లపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. తమది దోపిడీ సభ కాదని, ప్రజల మనసు దోచే సభ అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ మాదిరిగా తాము ప్రజల సొమ్ము కొట్టేయలేదన్నారు. టిఆర్ఎస్ మీటింగ్లో డబ్బులు పంచామని రేవంత్ అంటున్నారని, పెట్టెల్లో నోట్ల కట్టలు పెట్టడం రేవంత్ కు తెలిసినంతగా తమకు తెలియదని ఎద్దేవా చేశారు. వాళ్ల బాసులు ఢిల్లీలో ఉంటారని, తమ బాసులు గల్లీల్లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా ప్రగతి నివేదన సభ ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిమెంట్ పునాదిపై సభాస్థలి, వేదిక నిర్మాణంతో పాటు, సభ కోసం నూతనంగా 15 రోడ్లు వేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. 200కు పైగా జేసీబీలు, వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారని, అనుకున్న దానికంటే వేగంగా పనులు జరుగుతున్నాయని కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను ప్రగతి నివేదన సభ కోసం వినియోగిస్తానని, సెప్టెంబర్ 2న ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేశారు.
22

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here