చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో సింధు

తెలుగు తేజం పివి సింధు ఆసియాడ్ లో చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ప్రవేశించిన సింధు ఈ రోజు టైటిల్ కోసం ప్రపంచ నెంబర్ వన్ తైజు యింగ్ తో పోటీ పడనున్నది.
వరల్డ్‌ రెండో ర్యాంకర్‌ యమగుచితో జరిగిన ఉత్కంఠ సెమీఫైనల్లో 21-17, 15-21, 21-10 స్కోరుతో సింధు జయకేతనం ఎగురవేసింది. ఈ ఆసియాడ్‌ క్రీడల్లో యమగుచిపై సింధుకు ఇది రెండో విజయం.

యమగుచితో జరిగిన సెమీఫైనల్లో తొలుత తడబడిన సింధు.. మెల్లగా పుంజుకుని గేమ్‌పై పట్టు సాధించింది. తనకున్న పొడవుని ప్లస్ గా మార్చుకుని ర్యాలీలతో ప్రత్యర్థిపై ఆధిక్యం కనబరిచిన సింధు.. తొలి బ్రేక్‌కు 11-8 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో 21-17తో మొదటి గేమ్‌ సింధు వశమైంది. రెండో గేమ్‌లోనూ సింధు ఆధిపత్యం ప్రదర్శించినా.. అనవసర పొరపాట్లతో ఆధిక్యాన్ని చేజార్చుకుంది. దాంతో యమగుచి రెండో గేమ్‌ను గెలుపొందింది. కానీ మూడో గేమ్‌లో మళ్లీ పుంజుకొన్న సింధు 50 షాట్లతో సుదీర్ఘంగా సాగిన ర్యాలీని నెగ్గి ఆధిక్యంలో నిలిచింది. అదే ఊపులో ఓ అద్భుత స్మాష్‌తో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నేడు జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో స్వర్ణ పతకం కోసం ప్రపంచ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌తో సింధు తలపడుతుంది. గత ఐదుసార్లలో తైవాన్‌ షట్లర్‌ తైజును సింధు ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. కానీ ఈ సారి గెలుపు పై సింధు ధీమా వ్యక్తం చేస్తుంది.. ఇప్పటికే రజతం ఖాయం చేసుకున్న సింధు తైజు గోడను బీట్ చేసి.. స్వర్ణం అందుకుంటే.. మరో ఘనతను అందుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here