అందరికీ ఆదర్శప్రాయం ‘భారతంలో భీష్ముడు’ పాత్ర…!

మహాభారతంలో భీష్ముడిది ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది. భీష్ముడు అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు.

శంతనుడికి, గంగానదికి అష్టమ శిశువుగా జన్మించిన వాడు దేవవ్రతుడు. శంతనుడు గంగ యొక్క అందాన్ని చూసి ఇష్టపడి వివాహం చేసుకుంటానని కోరినప్పుడు గంగాదేవి, వివాహానంతరం నేను ఏమి చేసినా ప్రశ్నించకూడదు.. అడ్డు పడకూడదు.. అప్పుడే వివాహం చేసుకుంటాను అని ఒక కండిషన్ పెట్టి.. శంతనుడుని గంగ వివాహం చేసుకుంటాను అని అంటుంది.. అంతేకాదు.. ఒకవేళ నేను చేసిన పనికి ఎప్పుడైనా అడ్డు తగిలితే.. వెంటనే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని కూడా చెబుతుంది.. గంగ పెట్టి షరత్తులను అంగీకరించి శంతనుడు గంగను వివాహం చేసుకుంటాడు. ఈ దంపతులకు కొన్నాళ్ళకు ముద్దులొలికే మగ బిడ్డ పుడతాడు.. శంతనుడు తన వంశ వారసుడు అని సంతోషిస్తున్న సమయంలో గంగ ఆ ముద్దులొలికే బిడ్డను తీసుకుని నదిలో పడేస్తుంది. అది చూసి వారించబోయిన శంతనుడు, మళ్లీ అంతలోనే ఆమెకు ఇచ్చిన వాగ్ధానం గుర్తుకు వచ్చి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతాడు. ఆ తరువాత వరుసగా పుట్టిన ఏడుగురు పుత్రుల్ని కూడా అలానే నదిలో పడవేస్తుంది గంగ. ఎనిమిదవ పుత్రుడ్ని కూడా నదిలో పడేస్తుంటే భరించలేని శంతనుడు ఆమెను అడ్డుకుంటాడు. తను విధించిన షరతును ధిక్కరించినందుకు గాను బిడ్డను తీసుకుని పెంచి పెద్ద చేసి తిరిగి అప్పగిస్తానని దేవలోకానికి వెళ్లిపోతుంది గంగ. ఈ క్రమంలో బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. శంతనుడికి ఇచ్చిన మాట ప్రకారం బిడ్డ దేవవ్రతుడ్ని అతడికి అప్పగించి వెళ్లిపోతుంది. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మించాడు కనుక గాంగేయుడు అని కూడా పిలవబడ్డాడు.

సంసార జీవితంపైన కోరికతో శంతనుడు సత్యవతి అనే మత్స్యకన్యను చూసి మోహించి వివాహమాడాలని నిశ్చయించుకుని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. దానికి ఆమె తండ్రి దాసరాజు పుట్టిన బిడ్డకు రాజ్య పాలన అప్పగిస్తేనే తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానంటాడు. గంగకు, తనకు పుట్టిన బిడ్డ ఉండగా ఇతడిని రాజుని ఎలా చెయ్యాలి అని మదనపడుతుంటాడు శంతనుడు. విషయం తెలుసుకున్న దేవవ్రతుడు తండ్రి కోసం తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. నాటి నుంచి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. అందుకు ప్రతిగా శంతనుడు, తన కుమారుడికి స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ప్రసాదిస్తాడు. తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి జీవితాంతం బ్రహ్మచర్య దీక్షను కొనసాగించాడు భీష్ముడు.

పాండవులకు, కౌరవులకు శస్త్ర విద్యలు నేర్పిస్తాడు. అయితే, కురు వంశాన్ని సంరక్షించే బాధ్యతను తన మీద వేసుకుంటాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేశాడు. శిఖండిని అడ్డుగా పెట్టుకుని అర్జునుడు చేసిన యుద్దంలో గాయపడిన భీష్ముడు, అంపశయ్యపై పరుండి, యుద్ధం ముగిసిన తరువాత తన వద్దకు వచ్చిన పాండవులకు నీతిబోధ చేస్తాడు.. వాటినే మనం విష్ణు సహస్రనామాలుగా నేటికీ పటిస్తున్నాం.. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేస్తాడు. భీష్ముడు దేహత్యాగం చేసిన రోజుని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం… భారతంలో భీష్ముని పాత్ర అందరికీ ఆదర్శప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here